unfoldingWord 19 - ప్రవక్తలు
เค้าโครง: 1 Kings 16-18; 2 Kings 5; Jeremiah 38
รหัสบทความ: 1219
ภาษา: Telugu
ผู้ฟัง: General
เป้าหมายของสื่อบันทึกเสียง: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
สถานะ: Approved
บทความเป็นแนวทางพื้นฐานสำหรับการแปลและบันทึกเสียงภาษาอื่นๆ ควรดัดแปลงตามความจำเป็นเพื่อให้เข้าใจและเหมาะสมกับวัฒนธรรมและภาษาแต่ละภาษา คำศัพท์และแนวคิดบางคำที่ใช้อาจต้องอธิบายเพิ่มเติม หรือแทนที่ หรือตัดออก
เนื้อหาบทความ
దేవుడు అన్ని సమయాలలో తన ప్రజల వద్దకు తన ప్రవక్తలను పంపుతూ వచ్చాడు. ప్రవక్తలు దేవుని నుండి సందేశాలను వింటారు, వాటిని ప్రజలకు చెపుతుంటారు.
ఇశ్రాయేలు దేశం మీద ఆహాబు రాజుగా ఉన్నప్పుడు ఏలియా ప్రవక్తగా ఉన్నాడు. ఆహాబు రాజు చాలా దుర్మార్గుడైన రాజు. ప్రజలు అబద్దపు దేవుడు బయలును పూజించేలా చెయ్యాలని ప్రయత్నించాడు. కనుక ఏలియా ఆహాబు రాజుతో దేవుడు ప్రజలను శిక్షించబోతున్నాడని చెప్పాడు. అతడు రాజుతో ఇలా చెప్పాడు.“నేను చెప్పేవరకు ఈ రాజ్యంపై వర్షం, మంచు కురవదు.” ఇది విని ఆహాబుకు కోపం వచ్చి ఏలియాను చంపాలనుకున్నాడు.
కనుక దేవుడు ఏలియా ఆహాబునుండి తప్పించుకోడానికి అరణ్య ప్రదేశానికి వెళ్లాలని చెప్పాడు. ఏలియా తనకు దేవుడు చెప్పిన అరణ్యప్రదేశానికి ఒక వాగు దగ్గరకు వెళ్ళాడు. ప్రతీ ఉదయం, ప్రతీ సాయంత్రం పక్షులు ఏలియాకు రొట్టెనూ, మాంసాన్ని తీసుకొనివచ్చాయి. ఈ కాలంలో ఆహాబు, అతని సైన్యం ఏలియా కోసం వెదికారు అయితే వారు అతనిని కనుగొనలేకపోయారు.
ఆ దేశంలో వర్షం లేదు, కొంత కాలానికి ఆ వాగులోని నీరు ఎండిపోయింది. కనుక ఏలియా దగ్గరలో ఉన్న మరొక దేశానికి వెళ్ళాడు. ఆ దేశంలో ఒక పేద విధవరాలు ఉంది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. వారికి ఆహారం లేదు. ఎందుకంటే పంట లేదు. అయినా ఆమె ఏలియాకు ఆహారాన్ని పెట్టింది. అందుచేత దేవుడు ఆమెకూ, ఆమె కుమారునికి కావలసిన ఆహారాన్ని దయచేశాడు. వారి పిండి పాత్ర, నూనె బుడ్డి ఎప్పటికీ తక్కువ కాలేదు. కరువు కాలమంతయూ వారికి ఆహారం సమృద్ధిగా ఉంది. ఏలియా అక్కడ అనేక సంవత్సరాలు ఉన్నాడు.
మూడున్నర సంవత్సరాలు గడిచిన తరువాత, వర్షాన్ని తిరిగి రప్పిస్తానని దేవుడు ఎలియాతో చెప్పాడు. ఇశ్రాయేలు రాజ్యానికి వెళ్లి రాజైన ఆహాబుతో ఈ మాట చెప్పాలని దేవుడు చెప్పాడు. కనుక ఏలియా ఆహాబు వద్దకు వెళ్ళాడు. ఆహాబు ఏలియాను చూచినప్పుడు అతడు ఇలా అన్నాడు, “నీవే సమస్యల్ని సృష్టించేవాడవు!” ఏలియా ఇలా జవాబిచ్చాడు. “రాజా, నీవే సమస్యల్ని సృష్టించేవాడవు! యెహోవాను నిరాకరించావు. ఆయనే నిజమైన దేవుడు. అయితే నీవు బయలు దేవతను పూజిస్తున్నావు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కర్మెలు కొండవద్దకు తీసుకొని రావాలి.”
కనుక ప్రజలందరూ కర్మెలు కొండ వద్దకు వెళ్ళారు. బయలు సందేశాలు చెప్పేవారు అక్కడికి వచ్చారు. వారు బయలు ప్రవక్తలు. వారు 450 మంది ఉన్నారు. ఏలియా ప్రజలతో ఇలా చెప్పాడు, “మీరెంతకాలం మార్పు చెందకుండా ఉంటారు? యెహోవా దేవుడైన్తా ఆయనను పూజించండి! బయలు దేవుడైతే బయలును పూజించండి!”
అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలతో, “ఒక ఎద్దును వధించి, దాని మాంసమును ఒక బలిపీఠం మీద హోమబలిగా అర్పించండి, అయితే దాని మీద ఎటువంటి అగ్నిని రాజేయకండి, తరువాత నేను అదే కార్యాన్ని చేస్తాను. మరొక బలిపీఠం మీద మాంసాన్ని ఉంచుతాను. దేవుడు దాని మీదకు అగ్నిని పంపిన యెడల ఆయన నిజమైన దేవుడని మీరు తెలుసుకుంటారు.” కనుక బయలు ప్రవక్తలు ఒక బలిని సిద్ధపరచారు, అయితే అది అగ్నితో కాల్చబడలేదు.
అప్పుడు బయలు ప్రవక్తలందరూ బయలుకు ప్రార్థన చేసారు, “బయలూ మా ప్రార్థన ఆలకించు!” ఆ దినమంతా వారు ప్రార్థనలు చేసారు, గట్టిగా అరచారు. తమ శరీరాలను సహితం వారు కత్తులతో కోసుకున్నారు, అయినా బయలు జవాబు ఇవ్వలేదు. బలిపీఠం మీదకు అగ్నిని పంపించలేదు.
బయలు ప్రవక్తలు దాదాపుగా ఆ రోజంతా బయలు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. చివరికి వారు ప్రార్థన చెయ్యడం మానివేశారు. అప్పుడు ఏలియా మరొక ఎద్దును చంపి దాని మాంసమును బలిపీఠం మీద ఉంచాడు. దాని తరువాత దీని మీద ఆ మాంసం, బలిపీఠం, ఆ భూమి అంతా నిండిపోయేలా పన్నెండు పెద్ద కుండలతో నీళ్ళను పోయాలని ప్రజలతో చెప్పాడు.
అప్పుడు ఏలియా ఇలా ప్రార్థన చేసాడు, “యెహోవా, అబ్రాహాము, ఇస్సాకు, యూకోబుల దేవా నీవే ఇశ్రాయేలు నిజమైన దేవుడవనీ, నేను నీ సేవకుడననీ నేడు మాకు కనుపరచు. ఈ ప్రజలు నీవే నిజమైన దేవుడు అని తెలుసుకొనేలా నా ప్రార్థనకు జవాబివ్వు.”
వెంటనే ఆకాశంనుండి అగ్ని దిగివచ్చింది, ఆ మాంసాన్నీ, కట్టెలనూ, రాళ్ళనూ, ఆ భూమిని, బలిపీఠం చుట్టూ ఉన్న నీళ్ళనూ కాల్చి వేసింది. ప్రజలు ఈ కార్యాన్ని చూసినప్పుడు వారు నేలమీద సాగిలపడి, “యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు!” అని గట్టిగా అరచారు.
అప్పుడు ఏలియా ఇలా అన్నాడు, “బయలు ప్రవక్తలను ఎవరినూ తప్పించుకోనివ్వకండి!” అందుచేత ప్రజలు బయలు ప్రవక్తలను పట్టుకొన్నారు, అక్కడినుండి వెలుపలికి తీసుకొని వెళ్లి వారిని చంపారు.
అప్పుడు ఏలియా ఆహాబు రాజుతో ఇలా చెప్పాడు, “నీవు త్వరపడి నీ ఇంటికి వెళ్ళు, ఎందుకంటే వర్షం రాబోతుంది.” వెంటనే ఆకాశం నలుపుగా మారింది. దేవుడు కరువు స్థితిని ముగించబోతున్నాడు. దానిని బట్టి ఆయనే నిజమైన దేవుడని రుజువు అయ్యింది.
ఏలియా తన కార్యాన్ని ముగించిన తరువాత, దేవుడు ఎలిషా అను ఒక వ్యక్తిని తన ప్రవక్తగా ఉండడానికి ఎంపిక చేసాడు. దేవుడు ఎలిషా ద్వారా అనేక ఆశ్చర్యకార్యాలు చేసాడు. నయమానుకు జరిగిన అద్భుతకార్యం దానిలో ఒకటి. నయమాని ఒక సైన్యాధికారి. అయితే అతనికి చర్మ వ్యాధి కలిగింది. నయమాను ఎలిషాను గురించి విన్నాడు. కనుక అతడు ఎలిషా వద్దకు వెళ్లి తనను బాగు చెయ్యాలని అడిగాడు. యొర్దాను నదిలో ఏడుసార్లు మునగాలని నయమానుకు ఎలిషా చెప్పాడు.
నయమాను కోపగించుకొన్నాడు, నదిలో మునగడానికి అతడు నిరాకరించాడు. అది అతనికి తెలివితక్కువ తనం అనిపించింది. తరువాత తన మనసును మార్చుకొన్నాడు. యొర్దాను నది వద్దకు వెళ్ళాడు. ఆ నీటిలో ఏడుసార్లు మునిగాడు, ఏడుసార్లు నీటిలో మునిగి బయటికి వచ్చినప్పుడు దేవుడు అతనిని బాగుచేసాడు.
దేవుడు ఇశ్రాయేలు ప్రజల వద్దకు అనేకమంది ప్రవక్తలను పంపించాడు. ప్రజలు విగ్రహాలను పూజించడం మానివేయాలని వారందరూ చెప్పారు. దానికి బదులు వారు ఒకరి విషయంలో ఒకరు నీతిగా జీవించాలని, ఒకరి పట్ల ఒకరు కరుణ కలిగి యుండాలని చెప్పారు. దుష్టత్వాన్ని మాని దేవునికి విధేయత చూపించాలని వారు ప్రజలను హెచ్చరించారు. ఇశ్రాయేలు ప్రజలు ఈవిధంగా చెయ్యని యెడల దేవుడు వారి దోషాన్ని బట్టి వారిని శిక్షిస్తాడు, వారికి తీర్పు చేస్తాడు.
ఎక్కువ కాలం ప్రజలు దేవునికి విధేయత చూపించలేదు. ప్రవక్తలకు కీడు కలిగించారు, కొన్నిసార్లు వారు ప్రవక్తలను చంపారు. ఒకసారి యిర్మియా ప్రవక్తను ఎండిపోయిన బావిలో పడవేశారు. అతడు బావి ఆడుగు ప్రాంతంలోని బురదలో కూరుకుపోయాడు. అయితే రాజుకు ప్రవక్త పట్ల జాలి కలిగింది. యిర్మియా అక్కడ చనిపోవడానికి ముందే దానిలోనుండి తీయాలని సేవకులకు ఆజ్ఞ ఇచ్చాడు.
ప్రజలు వారిని ద్వేషించినా ప్రవక్తలు ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నారు. వారు పశ్చాత్తాప పడని యెడల దేవుడు వారిని శిక్షిస్తాడని ప్రజలను వారు హెచ్చరించారు. వారికి మెస్సీయను పంపిస్తాడని దేవుడు చేసిన వాగ్దానాన్ని వారికి జ్ఞాపకం చేసారు.