unfoldingWord 13 - ఇశ్రాయేలుతో దేవుని నిబంధన
Outline: Exodus 19-34
Broj skripte: 1213
Jezik: Telugu
Publika: General
Svrha: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
Status: Approved
Skripte su osnovne smernice za prevođenje i snimanje na druge jezike. Treba ih prilagoditi po potrebi kako bi bili razumljivi i relevantni za svaku različitu kulturu i jezik. Neki termini i koncepti koji se koriste možda će trebati dodatno objašnjenje ili čak biti zamenjeni ili potpuno izostavljeni.
Script Tekt
దేవుడు ఎర్రసముద్రం నుండి ఇశ్రాయేలీయులను నడిపించిన తరువాత, అరణ్యమార్గము నుండి వారిని సీనాయి పర్వతం వద్దకు వారిని నడిపించాడు. ఈ పర్వతం వద్దనే మోషే మండుతున్న పొదను చూచాడు. ఆ పర్వతం అడుగుభాగంలో ఇశ్రాయేలీయులు గుడారాలు వేసుకొని స్థిరపడ్డారు.
దేవుడు మోషేతోనూ, ఇశ్రాయేలీయులందరితోనూ ఇలా చెప్పాడు, “మీరు ఎల్లప్పుడూ నాకు విధేయత చూపించాలి, మీతో నేను చేస్తున్న నిబంధనను కొనసాగించాలి, ఈ విధంగా మీరు చేసినట్లయితే, మీరు నా సంపాద్య స్వాస్థ్యం అవుతారు, యాజక సమూహం అవుతారు, పరిశుద్ధజనాంగం అవుతారు.”
మూడు రోజులలో ప్రజలు దేవుడు తమ వద్దకు వచ్చేలా తమ్మును తాము సిద్ధపరచుకొన్నారు. అప్పుడు దేవుడు సీనాయి పర్వతం మీదకు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు పెద్ద ఉరుములు, మెరుపులు, పొగ, పెద్ద బూరల శబ్దాలు కలిగాయి. అప్పుడు మోషే పర్వతం మీదకు ఎక్కి వెళ్ళాడు.
తరువాత దేవుడు తన ప్రజలతో ఒక నిబంధన చేసాడు. ఆయన ఇలా చెప్పాడు, “నేను మీ దేవుడైన యెహోవాను, ఐగుప్తులోని బానిసత్వంలోనుండి మిమ్మును రక్షించినవాడను నేనే, ఇతర దేవుళ్ళను పూజించవద్దు.”
“విగ్రహాలు చేసికొనవద్దు, వాటిని పూజించవద్దు, ఎందుకంటే నేనే యెహోవాను, మీ ఏకైక దేవుడను నేనే. నా నామమును వ్యర్ధముగా ఉచ్చరింప వద్దు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించండి. అంటే ఆరు దినములు పని చెయ్యాలి, ఏడవ దినాన్ని నన్ను జ్ఞాపకం చేసుకోడానికి విశ్రమించాలి.”
“నీ తల్లినీ తండ్రినీ సన్మానించాలి. నరహత్య చెయ్యవద్దు. వ్యభిచారం చెయ్యవద్దు, దొంగిలించవద్దు. నీ పొరుగువాని భార్యను ఆశింపవద్దు, నీ పొరుగువాని ఇంటినైననూ లేక నీ పొరుగువాని దేనినైననూ ఆశింపవద్దు.”
తరువాత దేవుడు ఈ పది ఆజ్ఞలను రెండు రాతి పలకల మీద రాశాడు, వాటిని మోషేకు ఇచ్చాడు. తన ప్రజలు అనుసరించడానికి దేవుడు ఇంకా అనేక చట్టాలనూ, నియమాలనూ ఇచ్చాడు. వారు ఈ శాసనాలకు విధేయత చూపించినట్లయితే వారిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసాడు. వాటికి వారు విధేయత చూపించిన యెడల వారిని శిక్షిస్తానని హెచ్చరించాడు.
దేవుడు ఇశ్రాయేలీయులను ఒక పెద్ద గుడారాన్ని చెయ్యమని కూడా చెప్పాడు-సమాజం అంతా కలుసుకొనే ప్రత్యక్షపు గుడారం. ఈ గుడారాన్ని ఏవిధంగా చెయ్యాలో ఖచ్చితమైన వివరాలు చెప్పాడు. దానిలో ఏయే వస్తువులు ఉంచాలో చెప్పాడు. ఈ పెద్ద గుడారాన్ని రెండు గదులుగా చెయ్యడానికి మధ్యలో ఒక తెరను ఉంచాలని చెప్పాడు. ఆ తెర వెనుకకు దేవుడు వచ్చి అక్కడ నివాసం చేస్తాడు, ప్రధాన యాజకులు మాత్రమే దేవుడు వచ్చే ఆ స్థలంలో ప్రవేశించడానికి అనుమతి ఉంది.
ప్రత్యక్షపు గుడారం యెదుట వారు ఒక బలిపీఠాన్ని ఏర్పాటు చెయ్యాలి. దేవుని చట్టాన్ని మీరినవారు ఎవరైనా ఆ బలిపీఠం వద్దకు ఒక జంతువును తీసుకొని రావాలి. యాజకుడు ఆ జంతువును వధించాలి, దానిని ఆ బలిపీఠం మీద హోమబలిగా దహించాలి. ఆ జంతువు రక్తం ఆ వ్యక్తి పాపాన్ని కప్పివేస్తుందని దేవుడు చెప్పాడు. ఈ విధంగా దేవుడు ఆ వ్యక్తి పాపాన్ని చూడదు. దేవుని దృష్టిలో ఆ వ్యక్తి “శుద్ధుడు” అవుతాడు. దేవుడు మోషే సహోదరుడు, ఆహారోనును ఎంపిక చేసాడు, ఆహారోను సంతానం దేవుని యాజకులుగా ఉంటారు.
దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన శాసనాలకు విధేయత చూపించదానికి ప్రజలందరూ అంగీకరించారు. దేవునికి మాత్రమే చెందియుండడానికి అంగీకరించారు. ఆయనను మాత్రమే ఆరాధించడానికి అంగీకరించారు.
అనేక దినాలుగా మోషే సీనాయి పర్వతం మీదనే ఉన్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. మోషే కోసం కనిపెట్టడంలో ప్రజలు అలసిపోయారు. అందుచేత వారు బంగారాన్ని తీసుకొని ఆహారోను వద్దకు వచ్చారు. దేవునికి బదులు ఆరాధించడానికి ఒక విగ్రహాన్ని చెయ్యమని ఆయనను అడిగారు. ఈ విధంగా వారు దేవునికి వ్యతిరేకంగా భయంకరమైన పాపం చేసారు.
ఆహారోను ఒక దూడ రూపంలో ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేసాడు. ప్రజలు ఆ విగ్రహాన్ని బహిరంగంగా పూజించడం ఆరంభించారు. వారి పాపాన్ని బట్టి దేవుడు వారిని బహుగా కోపగించుకొన్నాడు. ఆయన వారిని నాశనం చెయ్యాలని చూసాడు. అయితే మోషే వారిని సంహరించవద్దని దేవుణ్ణి బతిమాలాడు. దేవుడు మోషే ప్రార్థన విని ప్రజలను నాశనం చెయ్యలేదు.
చివరికి మోషే సీనాయి పర్వతం నుండి దిగి వచ్చాడు. దేవుడు తన స్వహస్తాలతో రాసిన పది ఆజ్ఞల రెండు పలకలను మోషే తీసుకొని వచ్చాడు. అప్పుడు మోషే ఆ విగ్రహాన్ని చూచాడు. చాలా కోపపడి తన చేతులలోని రెండు పలకలను పగులగొట్టాడు.
అప్పుడు మోషే ఆ విగ్రహాన్ని తుత్తునియలుగా చేసాడు. దాని పొడిని నీటిలో కలిపి ఆ నీటిని ప్రజలతో తాగించాడు. దేవుడు ఆ ప్రజల మీద ఒక తెగులును రప్పించాడు, ఫలితంగా వారిలో అనేకులు చనిపోయారు.
తాను పగులగొట్టిన పలకల స్థానంలో పది ఆజ్ఞల కోసం కొత్త పలకలను చేసాడు. అప్పుడు మోషే తిరిగి పర్వతం మీదకు వెళ్ళాడు, తన ప్రజలను క్షమించాలని దేవుణ్ణి ప్రార్థించాడు. రెండు నూతన పలకల మీద పది ఆజ్ఞలను తీసుకొని మోషే సీనాయి పర్వతం దిగి వచ్చాడు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులను సీనాయి పర్వతం నుండి వాగ్దాన దేశం వైపుకు నడిపించాడు.